Bhakthi Rasaayanamu Chapters Last Pages
అనుబంధము 3
శృంగారాదిరసే ష్వేషు య దంత ర్భాతి నిత్యశః,
త ద్వందే శాంత మద్వైతం యేన సర్వ మిదం తతమ్.
భావై ర్యథా విలసితా నిజచిత్తవృత్తి
రాప్నో త్యలోకవిభ##వై శ్చ రసాదిరూపా೯
ఆ స్వాదయోగ్యనుభగా೯ వివృణోమి తావ
న్ని శ్శేష మత్ర రసభావవికల్పమార్గే.
రసచర్వణ, భక్తిభావన, బ్రహ్మానుభూతి, అనునవి అపరోక్షానుభూతులు. ఈమాటికి అన్యోన్య సంబంధము కలదు. విభిన్న మార్గముల నవలంబించు నీ మూటియందును ఉత్తమ పురుషార్థములే ఉద్దిష్టవిషయములు. వీటిలో నాబాలవృద్ధులకు నిర్వికల్పక ప్రతీతియోగ్య మైనది రసచర్వణ. ఈ రసచర్వణలోగల రసశబ్దమున కర్థమేమి? అను ప్రశ్నకు సమాధాన మీయవలె ననిన శాంతరసమును విచారించవలెను. రసమనగా శాంతమేయని, శాంత ముపహితముకాగా, ఆయా ఉపాధుల ననుసరించి శృంగారము మొదలుగాగల ఎనిమిది రసములు రాగలవని ఈ విచారణలో సిద్ధము కాగలదు.
శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము, అధ్భుతము అను ఎనిమిది రసముల నాలంకారికు లందకు అంగీకరించినారు. వీటిలో శృంగార, హాస, కరుణాద్భుతములే రసములని ఆంధ్రభారతిలో వివరించి యున్నాను. ఇవిగాక అనేక రసము లున్న వని ఆలం కారికులు కొందరు వాదించియున్నారు. ఈ నవ్యరసములకు చెప్పబడు స్థాయిభావములకు స్థాయిత్వము లేకపోవుటచే నివి రసములు కాజాలవని వివరించితిని. కాని శాంతమను ఇంకొక రసమును గూర్చి బహూతరవిచార మాలంకారికులచే గావింపబడినది. శాంతము రసము కాజాలదని పలువురు వచించి యున్నారు. శాంతము తొమ్మిదవ రసమని, ఉత్తమపురుషార్థమగు మోక్షము నుద్దేశించిన దగుటచే నతిప్రధానమైన దని కొందరు పలికియున్నారు. సకలసాహిత్యమునకు శాంత ప్రవర్తకత్వమును సాధించిన భట్టనాయకుని మార్గము నవలంబించి అభినవగుప్తుడు శాంతమును మహారసమని శాంతమే రసమని వివరించినాడు.
శృంగారాది రసములవంటిది శాంతము కాదని ఈ వాదవివాదములలో స్పష్ట మగుచున్నది. ఈ వైలక్షణ్య మెందువలన వచ్చు చున్నది? శృంగారాదులవంటిది కాకపోయినను శాంతమును రసమని ఏల వ్యవహరించుచున్నాము?
ఈ ప్రశ్నలకు ప్రత్యుత్తరము నొసగుటకు ముందు శాంతరస మెట్లు సమీక్షకుల చేతిలో పడినదో గమనించవలెను. దాక్షిణాత్యప్రతు లనుసరించు నాట్యశాస్త్రమున శాంతరస ప్రకరణము లేదు. ''అష్టరసాశ్రయో నియుక్తః'' అని విక్రమోర్వశీయమున మహాకవి పలికినాడు. ఉభయాభిసారికలో వరరుచి ఎనిమిది రసములనే చెప్పినాడు. రసములను నందికేశ్వరుడు ప్రపంచించి నాడని రాజశేఖరు డనినాడు. వాసుకిద్వారా శాంతరసము వచ్చినదని శారదాతనయుని అభిప్రాయము. కోహలుడు శాంతరసమును తెచ్చినాడని ధర్మసూరిప్రభృతు లనినారు. ఉద్భటుడు శాంతరసమును ప్రస్తుతించి యున్నాడు. భట్టనాయకుడు శాంతమును విశేషించి వివరించినాడు. అభినవగుప్తుడు శాంతరసప్రకరణమున విజృంభించినాడు. ఆనందవర్థనునకు పూర్వము శాంతరసమును గూర్చి వాదోపవాదములు గలవని స్పష్టము. ఈ శాంతరసమునకు సంబంధించిన భాగమును నాట్యశాస్త్రములోనికి ప్రవేశింప జేసిననాడు భరతుడు కానిచో భట్టనాయకుడే ఐ ఉండవచ్చు నని ఎంచుటకు తగిన ఆధారము కన్పించుచున్నది.
సర్వశాస్త్రార్థప్రవర్తకము సర్వభావానుకీర్తనము లోక వృత్తానుకరణము, సప్తద్వీపానుకరణము నగునది నాట్యమని భరతు డనేకపర్యాయములు చెప్పియున్నాడు. ఇట్టినాట్యమున శాంత ముండదని భావించుట దుష్కరము. జీవితము నంతయు ప్రదర్శించు నాట్యము భిన్న రుచులు గల ప్రజల కందరకు తృప్తినొసగునది. యువకులు శృంగారమున, వైదగ్ధ్యము కలవారు నాట్యగతభావమున, అర్థపరులు వీరరౌద్రాదుల యందు, విరాగుల మోక్షమున సంతోషము నందుచున్నా రని భరతుడు చెప్పునపుడు మోక్షశబ్దమునకు శాంతమని అర్థము చెప్పవలెను. భిన్నరుచులు గలజనులకు సంతోషమును గూర్చుచు, కావ్యజగమున నవగతములగు సూత్రములను, నియములను నాట్యము వదలజాలదుగనుక శాంతము కావ్యజగములో విశిష్టముగా ప్రతీయమానము కావలసి యున్నది.
కావ్యజగమున గల పురుషార్థములే రసములు. కావ్యే తరజగమునుండిగాని, కవియొక్క మనస్సునుండిగాని, ఆవిర్భవించునవి రసములు కావు. తత్త్వనిష్ఠములైన రసములు తత్త్వమును సౌందర్యరూపమున నుపహితము జేయునవి. ఈ రసములలో మనకు తత్త్వావగతి కలుగుచున్నది. కావున నీ రసమునలో ననువృత్తమగుచు. రసములకు సౌందర్యత్వాది ధర్మముల నాపాదించుచు, రసములకు రసత్వమును సిద్ధింపజేయుతత్త్వమేదో, ఆ తత్త్వమెట్లు కావ్యలోకమును ప్రవేశించుచున్నదో, మనము తెలిసికొన వలసియున్నది. ఈ తత్త్వమునే శాంత మనవలె నని సిద్ధాంతింప బోవుచున్నాము.
ప్రతిపురుషార్థమునకు నొక కామము గలదని చెప్పుచు భరతుడు మోక్షకామమునుగూడ ప్రస్తుతించి నాడు. అనురాగవిరాగములు సంవలితములై మోక్షకామమున నుండ గలవు. విరాగానురాగముల కతీతమైన దీయవస్థ. ఇట్టి అవస్థలో కన్పించు శృంగారము లౌకికశృంగారమువంటిది గాక బ్రహ్మభావనవంటి దని చెప్పవలెను. దీనినే భక్తిశృంగారముగా కొందరు ప్రపంచించినారు. ఈ భక్తిశృంగారమున ప్రతీత మగు శాంతమును గురించి.
''యో మాం ప్రయతతే హంతుం
మోక్ష మాస్థాయ పండితః
తస్య మోక్షరతిస్థస్య
నృత్యామి చ హసామి చ''
అని మహాభారతము చెప్పుచున్నది. ''మోక్షము నుద్దేశించి నన్ను చంపుటకు యత్నించు పండితునకు సహితము మోక్షరతి యుండుటచే అట్టివానిని చూచి హసించుచు ఆడుదును''అని కామము చెప్పుచున్నది. మోక్షశృంగారమున ప్రమాతృప్రమేయముల కభేదప్రవృత్తి వాంఛిత మగును.
ధర్మశృంగారమును గురించికూడ భరతుడు పల్కుచున్నాడు. ధర్మాభివ్యక్తి రసచర్వణలో ఉన్నను, ధర్మాధర్మములచే రసము నియంత్రిత మగుటలేదు. పురుషార్థ మగు ధర్మమే తత్త్వ మగుటవలనను, ఈ తత్త్వావగతియే రసచర్వణలో కన్పించుటచేతను, రసము నుపహితముచేయు కావ్యము ధర్మవిరుద్ధము కాజాలదు. ఈ ధర్మము భావనానుప్రాణితమై కావ్యమున గలదు. ఏవంవిధమగు ధర్మప్రతీతి వృద్ధులకే ముఖ్యముగా కలుగునది భరతుడు పలికియున్నాడు. వృద్ధులనగా అనుభవజ్ఞులని అభిప్రాయము.
తత్త్వజ్ఞానమువలన నిర్వేదము తపోనియమమువలనగ్లాని, కలుగునని భరతుడు చెప్పుచున్నాడు. విజ్ఞానము, శ్రుతి, శౌచాచారము, గురుభక్తి అనునవి ధృతికి గల విభావములు. నానాశాస్త్రవిచింతనమువలన మతి వచ్చును. ఇట్లు ఉత్సాహము, విశ్రాంతి అనువానిని నొసగగల రూపకమున అనేకభావములు కన్పించగలవు. ఇట్టి నాట్యము కర్మసంశ్రయము, హితోపదేశజనకము, ధృతిక్రీడానుఖాదికరము, నానా వస్థాంతరాత్మకము, దుఃఖశ్రమశోకార్తులకు విశ్రాంతిప్రదము, బుద్ధివివర్ధనము, సర్వజ్ఞానముల కాకరము, సుఖదుఃఖసమన్వితము వినోదకరణము అని మొదటిఅధ్యాయమున చెప్పబడినది. కావుననే నాట్యమున త్రైలోక్యభావానుకీర్తనము గలదని చెప్ప గలుగుచున్నాము. ఇట్టి నాట్యము శృంగారాదిరసముల ద్వారా అనుభూత మగుచున్నది. ప్రతిరసమున ఒక్కొక్క అంశ##మేకన్పించగలదు. కాని సమగ్రతత్త్వము,సకలప్రపంచము అభివ్యక్త మగునట్లు చేయజాలిన దొక్క శాంతరసమే. శాంతము శృంగారాదులవంటి రసము కాజాలదు.
2. శాంత మనగా ప్రవృత్తి రహిత మైన అవస్థ. నివృత్తాత్మక మగు స్థితిలో ఇచ్ఛాశక్తి నిద్రించి యుండును. ఇచ్ఛాశక్తి శూన్యమై, పారలౌకిక విషయ వ్యంజక మైన శాంతము రసము కాజాలదు. అనాది కాలప్రవాహాయాత రాగద్వేషాదులను నిర్మూలించుట అశక్య మగుటచే శాంతమును రసముగా గాని, వాస్తవముగా కన్పించు అవస్థగా గాని ఎంచరాదు. పైగా క్రీడనీయక మగు నాట్యమున శాంతమున కుపకరించు ప్రవృత్తి రాహిత్యము గానరాదు. నాగానందమువంటి నాటకములలో పరోపకారాకృత మగు త్రివర్గప్రాప్తియే ఫలమని ఎంచవలెను. బుద్ధివిలాసప్రధాన మగు అర్థకామోత్తరము సకలలోక హృదయ సంవాద సుందర ప్రయోజనము గలిగి యుండుటచే రూపకమున శాంతమునకు ప్రసక్తిలేదు.
ఇతరరసములలో వలె శాంతమున స్థాయి సంచారి భావముల అన్యోన్యసంవలనము కన్పించదు. ఈ సంవలనము ప్రవృత్తినిష్ఠమైన దగుటచే శాంతమున కన్పించ జాల దని భావము. నివృత్తిపర మగు అవస్థ అందరకు అనుభూతి యోగ్యము కా జాలదు. కావున ఇతరరసములలో నొక అంగముగానే శాంతము కన్పించ వీ లున్నదని చంద్రికాకారుని వాదము. ఈ వాదము ననుసరించి, విద్యాధరప్రభుత్వము నందగలిగిన జీమూతవాహన చర్రిలో వీరరస మున్న దనవలెను. ఇచ్చట అంగముగా శాంత ముండుటచే దయావీర మను వీర రస భేదము కల దనవలెను. అనుభూత మగు రసమును తద్వి భావరూప మగు దయావీరత్వముతో నభిన్నముగా గ్రహించ వలసి వచ్చును. విభావమునే రసముగా పరిగణించుట అశాస్త్రీయ మగుటచే వీరమును పాత్రస్వభావమగు విభావముగానే గ్రహించవలె నని రసముగా నెంచరా దని తెలియవలెను. కావున నాగానందమున వీరరస మున్న దనువారు కేవలము విభావమునే వివరించుచున్నారుగాని, రసమును నిర్వచించుట లేదని నిశ్చయింపవలెను.
రసప్రతీతిలో వివిధవిషయముల సమన్వయము, ఆత్మ వికాసము, విశ్రాంతి గలవు. ఆన్యాపదేశరూపమున చెప్పబడు కావ్యములలో నీ ఆత్మవికాసమునకు విఘ్నములు కలుగ గలవు. ఇట్టి గాథలలో వ్యంజేనావ్యాపారమే కన్పించగలదు గాని సమగ్రమగు రసచర్వణ కలుగదు. ఒకవేళ కలిగినను అది సంచారిభావరూపముననేప్రతీతమగును. అన్యాపదేశరూపమున శాంతము నుపదేశింపగోరు కవికూడ కృతకృత్యుడు కాలేడు. శాంతోపదేశము చేయు కావ్యము నవలోకించు నపుడు కావ్యబహిర్భూతములగు నియమాదు అవసరము. కాని కావ్యజగమునుండి బయటకువచ్చి లౌకికజగములోని నియమములతో కావ్యమును సమీక్షచేయుచో భావనా వ్యాపారము పరిత్యక్తమగును. తద్ద్వారా రసముకూడ మన అనుభూతికి బాహ్యము కాగలదు. కావున శాంతమును రసమని చెప్పినచో కావ్యజగముననే శాంతము నన్వేషించి, కావ్యలోకమున శాంతమున కే స్వభావము కలదో నిశ్చయింపవలెను.
రూపకము దృశ్యశ్రవ్యాత్మకము. రూపకము రంగమున ప్రదర్శించుటకు యోగ్యమై యుండవలెను. ఈ ప్రదర్శనలో ప్రవృత్తి అతిముఖ్యమైన దగుటచే నివృత్త్యాత్మక మని చెప్పబడు శాంతమున కిచట తావు లేదు. చేష్టావ్యుపరమమగు అవస్థ ప్రయోగయోగ్యము కాదు. రూపకము నవలోకించు సామాజికులు విశిష్ట మగు అనుభూతిని గోరి వచ్చు చున్నారు గాని నివృత్త్యాత్మకము, ఉపదేశయుతము నగు శాంతమును గోరి వచ్చుటలేదు. శృంగారాదిరసములు ద్రుతి, విస్తర, వికాస సంపలిత మగు అనుభూతుల నొసగు చున్నది.
ఇట్టి అనుభూతి లేకున్నను శాంతమున నాత్మవికాస ముండుటచే శాంతమును రసము కా దనలేము.
నిష్కామము, నివృత్త్యాత్మకము, పారలౌకికపరమునగు శాంతము ప్రయోగయోగ్యము కాని రంగమున అనుభూతి యోగ్యము కా జాలదు. అనాది కాల ప్రవాహాయాతము లగు రాగద్వేషముల నుచ్ఛేదించుట అశక్యమగుటచే శాంత ప్రతీతి అస్వాభావిక మగును. సర్వజనానుభవ గోచరత్వము కూడ శాంతమునకు లేదు. ఈ హృదయసంవాదములేని శాంతమునకు రసత్వము లేదు.
కాని అలోకసామాన్యమగు మహానుభావచిత్తవృత్తిని లేదని ఎట్లనలేమో, అట్లే శాంతప్రతీతి లేదనజాలము. శాంత రసప్రతీతిగల మహాభారతమును కావ్యజగమునుండి వెడల గొట్టలేముకదా! శాంతమున నివృత్తిపూర్వకమగు చిత్తవృత్తియే కలదని యనుట దుష్కరము. పైగా లౌకికజగద్విపరణము, లోకవృత్తసమీక్షకము నగు కావ్యజగమున లౌకిక జీవితములో కన్పించు శాంతము లేదని యనుట సాహసము. కావ్యజగమును ప్రవేశించిన శాంతమున భావనావ్యాపారము రసత్వము కన్పించక తప్పదు. ఇట్టి శాంతము లౌకిక శాంతమునకంటె విలక్షణమగును. భావానాసమున్మిషితమైన రసత్వమున దేశకాల ప్రమాత్రాద్యుపాధులు నశింపగలవు. ఏవం విధమగు నిష్కామభావయే శాంతరసమున గలదు, ఇట్టి శాంతప్రతీతి సకలజనానుభవ గోచరము కాదనిన, శృంగారానుభూతికూడ విరాగులకు లేదని, తద్ద్వారా శృంగారము రసము కాజాలదని పలుకవలసి వచ్చునని లోచనకారుడు పలికినాడు. సర్వానుగ్రాహకమగు కావ్యజగమున నిష్కామభావనతో సిద్ధమగు శాంత ముండకతప్పదు. సమాధిలోగల యోగ ప్రత్యక్షమున శాంతమే ప్రధానమని, జీవితహేతుభూతమగునదని తెలియవచ్చు చున్నది. భయానకాది రసములలో తామసప్రకృతులకే రసప్రతీతి కలదు. ఇట్లే తత్త్వ జ్ఞాన బీజ సంస్కారము గలవారలకు శాంతరసప్రతీతి కలదనవలెను. అధికారిభేదము నాశ్రయించుకొని వచ్చిన హృదయసంవాదమే భిన్న భిన్న రసములను నియంత్రించుచున్నది. కావున శాంతమునకు రసజగమున నేస్థాన మున్నదో విచారింపవలెను. శాంతమును శృంగారాదులవంటి రసముగా స్వీకరింపవలెనా? లేదా?
మన ఆలంకారికు లీ విషయమును వివేచింపలేదు. కాని శాంతముయొక్క స్థాయిభావములను విచారించు సందర్భమున శాంతరసస్వభావమును తెలిసికొనుటకు తగిన విషయమును కొంత ఇచ్చియున్నారు. శాంతము రసమా? కాదా? అను విచారణలతో నున్న అలంకారికులు ఏకకంఠముతో నొకే ఒక స్థాయిభావమును శాంతమున కప్పగించలే రని మరువరాదు. ఈ భిన్న స్థాయిభావముల నొకసారి పర్యాలోచన చేసిన శాంత స్వరూప స్వభావములు కొంతవరకు అవగతములు కా గలవు.
3. శమమును శాంతరసముయొక్క స్థాయిభావ మని కొంద రనినారు. కాని భరతు డిచ్చిన భావములలో శమము కన్పించకపోవుటచే నిర్వేదమే శాంతస్థాయిభావ మని కొందరు, శమనిర్వేదములు పర్యాయపదము లని మరికొందరు పలికి నారు. శమ మనగా ప్రవృత్తిరహిత మగు అవస్థ యని గ్రహించి, ఇట్టి శమము రసపరిపోషకము కా జాల దని దశరూపకారు డనినాడు. కాని రూపకమున శాంతమునకు స్థానము లేకున్నను రూపకవిలక్షణము లగు కావ్యములలో శాంతముండ వీలున్న దని అవలోక కారు డనినాడు. ఐనను శాంతము ప్రవృత్తిశూన్య మగు స్థితి యని, ఇట్టిస్థితి అనిర్వచనీయ మగు లోకోత్తరాహ్లాదమే కా గలదని, ఈ ఆహ్లాదము కావ్యబహిర్భూత మని యనుచున్నాడు.
సర్వచిత్తవృత్తి ప్రశమమే శాంతమునకు స్థాయి యని కొందరనినట్లు లోచనకారుడు పలుకుచున్నాడు. చిత్త వృత్తి ప్రశమము చిత్తవృత్తి కాజాలదు గనుకను, స్థాయిభావము చిత్తవృత్తి యగుటవలనను ఈ వాదము పరాస్త మగు చున్నది. కాని తృష్ణాక్షయరూప మగు చిత్తవృత్తిగా దీనిని గ్రహించి, ప్రసద్యప్రతీషేధముగా గాక పర్యుదాసముగా చెప్పినచో నిది శమమకంటె విలక్షణము కా జాలదు. నిర్వికార చిత్తత్వమే శమమును నిర్వచించునదని రుద్రభట్టుకూడ చెప్పియున్నాడు. సర్వేంద్రియముల ఉపరమ లక్షణముగా శాంతమును ప్రవంచించు ప్రపంచహృదయము కూడ నీ వాదమునే అంగీకరించు చున్నది. కాని సర్వేంద్రియోపరమమున ప్రవృత్తిగాని, చిత్తవృత్తిగాని ఉండ జాలవు. కావున అనుపజాత విశేషాంతర చిత్తవృత్తి రూప మగు స్థాయిభావమును శాంతమున కొందరు కనిపెట్ట గలిగినారు. దీనిని నిర్విశేష చిత్తవృత్తి యందురు. ఉత్తమము లగు అనుభూతులలో ఇచ్ఛాశక్తికి ప్రాధాన్యము కన్పించదు. ఇచ్ఛాశక్తి ద్వారా ఆత్మవికాసమునకు విఘ్నమే కన్పించ గలదు. నిర్విఘ్న స్వసంవేదనాత్మకముగా రసచర్వణ కల దని యనునపుడు ఇచ్ఛాశక్తి అన్యశక్తులతో సంవలితమై సమన్వయము నందు చున్నదని అంగీకరించి యున్నాము. కావున శాంతప్రతీతలో తృష్ణాక్షయసుఖ మున్న దని ఆనందవర్థనుడు పలికినపుడు శాంత మనగా రస మని యర్థము. చెప్పికొనవలసి వచ్చు చున్నది. రస శాంత శబ్దములు పర్యాయపదము లైన ఈ సిద్ధాంతము సమంజస మగును.
తృష్ణాక్షయసుఖ పరిపోషలక్షణము. గల శాంతరసమున అహంకారప్రశమము గల దని చెప్పుచు ఇట్టి శాంతము అహంకారపూరిత మగు వీరరసముకంటె అత్యంత విలక్షణమైన దని ఆనందవర్థను డనినాడు. అహంకార ప్రశమమనగా దేశ కాల ప్రమాత్రా ద్యుపాధులు నశించగా కలుగు అపరిచ్ఛిన్న మగు ఆత్మానుభూతి యని అర్థము. ఇట్టి శాంతమున నహంకార ప్రశమము కల దని చెప్పిన తృష్ణాక్షయసుఖ మనగా శమమే యని అర్థము చెప్పవలె నని హేమచంద్రు డనుచున్నాడు. ఈ వాదము లన్నియు శమము నా ధారము చేసికొని శాంతమును నిర్వచింప యత్నించునవి.
సమ్యగ్ జ్ఞానమును శాంతస్థాయిగా రుద్రటు డంగీకరించినాడు. సమ్యగ్ జ్ఞానమున నిష్కామభావన. సుఖదుఃఖముల కతీతమగు స్థితి కలుగగలవు. కాని ఈ శాంతమునగూడ విభావానుభావ వ్యభిచారి భావసంయోగము కలదని నమిసాధువు చెప్పుచున్నాడు. శబ్దాదివిషయస్వరూపమగు విభావము, జన్మాదికమగు అనుభావములు, త్రాసాదిసంచారిణులు నిచట గలవని ఇతని అభిప్రాయము. ఇట్టి సమ్యగ్ జ్ఞానము మనలను విషయపరాఙ్ముఖులనుగా చేయును. అట్టిచో సమ్యగ్ జ్ఞానజన్యమగు శమమే శాంతమునకు స్థాయి యగుట యుక్త మేమో అని అనిపించగలదు.
వస్తుతత్త్వాలోచనాదికము లగు ఉద్దీపన విభావములు స్మృత్యాది వ్యభిచారిభావములు కలిగి ధృతిస్థాయిభావాత్మక మైనది శాంతమని సరస్వతీకంఠాభరణకారుని వాదము. ఈ ధృతియొక్క విశిష్టభావమె శమ మని కూడ చెప్పుచున్నాడు. మన మింతవరకు విచారించిన వాదములకంటె అధికమైన విషయ మిచట లభించుటలేదు. శమ మను రూపముతో ధృతి కన్పించు దనినచో శమమునే స్థాయిగా చెప్పవచ్చును ఇట్లే తత్త్వజ్ఞానమును మతియొక్క విశిష్టరూప మనుచున్నాడు. శృంగారప్రకాశలో స్పష్టముగా శాంతరసస్థాయి శమ మని చెప్పబడినది.
ఉద్విగ్న చేతస్కులకు నాట్యము ధృతిని కలుగజేయు నని మొదటి అధ్యాయములో భరతుడు చెప్పియున్నాడు. కావ్యజగమునగల రసచర్వణలో ఉద్విగ్నమానసము పోయి విశ్రాంతి చేకూరు నని భావము. శౌర్యము, విజ్ఞానము, శ్రుతి, విభవము, శౌచము, ఆచారము, గురుభక్తి, అధిక మనోరథార్థలాభము, క్రీడ మొదలగునవి ధృతిని ఉత్పన్నము చేయునవని భరతుడు పలికియున్నాడు. వీటిద్వారా మనస్సు పరిష్కృతమై, ఆత్మ నిర్మల మగును. ఇట్టి విశదీభూతమగు అవస్థను ధృతి యందురు. ఈ విశదీభావము ప్రతిసహృదయుని యందును కన్పించగలదు. కావున ధృతినిస్వీకరించు శాంతము ప్రతిరసానుభూతియందు కలదని చెప్పవలెను.
4. కోరికలు నశించగా కలుగు విశ్రాంతి లక్షణమగు అనుభూతిగా శాంతమును స్వీకరించిన వాదములను విచారించితిమి. కోరికలు నశించిన నిరాశ, దైన్యము మొదలగునవి సంభవించు నవకాశ మున్నది. కాని ఇచ్చట ఇచ్ఛాశక్తి సంతృప్తమై, ప్రశమితమై యుండును. వాసనారూపమున నుండు సంస్కారములు చక్కగా నియంత్రితములు కానంతవరకు ఇచ్ఛాప్రశమనము కుదురదు.
''తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్''
''తచ్ఛిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః''
అని యోగదర్శనము చెప్పుచున్నది. సంస్కారములు ప్రశమితము లైనచో ఆత్మశాంతి కలుగును. సంస్కారములు నిరుద్ధములైన చిత్తము ప్రశాంతమై విక్షేపశక్తిరహితమగును. చిత్తవిక్షేపరాహిత్యమగు స్థితి ఉత్తమములగు అనుభూతుల కతిప్రధాన మైనది. ఈస్థితియే సమాధికి యోగ్యమైనది, స్వార్థములగు భావములు, సంవేదనములు ఈస్థితిలో కన్పించజాలవు. స్వార్థరహితమగు చర్వణలో ఆత్మ ఉపాధిరహిత మగును. రూపముద్వారా ఉపహిత మగుచున్నను కావ్యజగము నిరుపహితమగు అనుభూతి నీయ గల్గుచున్నది. ఈ నిరుపహితమగు అనుభూతిని శాంతమని కావ్యజగమున వ్యవహరించు చున్నాము. నాట్యమునగూడ లోకోత్తర పరమపురుషార్థ సూచన కన్పించుటచే నాట్యము శాంతరసోపక్షేప మని భట్ట నాయకుడు వచించినాడు. విక్షిప్తమగు చిత్తమును ఉత్తమమార్గమునకు తీసికొనిపోవునది కావ్యము. సంస్కృతమైన చిత్తము ఆత్మగానే భాసించగలదు. ఈసంస్కృతి కావ్యమం దుసహితమైన రసము నాశ్రయించుకొని వచ్చునది. కావున రసచర్వణ వేరు, పురుషార్థప్రాప్తి వేరు, అని ప్రపంచించుట ప్రామాదికము.
కావ్యజగమున సంప్రాప్త మగు పురుషార్థము కావ్యమునకు బహిర్భూతము కాజాలదు. కావ్యాంతర్గతమై వస్తుతః అనుపహితమై యున్న లోకోత్తర మగు జ్ఞానము నభివ్యక్తము చేయునది పురుషార్థమని పిలువబడుచున్నది. ఇట్టి పురుషార్థ ప్రాప్తిలో ఆత్మానాత్మ లభిన్నములను ప్రతీతి కలుగును. ఏవంవిధ మగు స్థితి ని అనిర్వచనీయ మనక తప్పదు గనుక శాంత మని పిలుచు చున్నాము. అనిర్వచనీయ మైనను శాంతము నివృత్త్యాత్మకము కాజాలదు. ఆ ధ్యాత్మిక మగు అనుభూతులలో సహితము చిత్త వృత్తులు నివృత్తము లగుటలేదు. ప్రతి ఉత్తమ అనుభూతియు విశిష్ట మైనది. ఇందు విశిష్ట చిత్తవృత్తి విశిష్ట ప్రయోజనము కలవు. ఈ వైశిష్ట్యము భావనామ ప్రాణిత మైనచో రసానుభూతి వచ్చును. కావున మోక్షాభిధాన పరమ పురుషోర్థోచిత మగు చిత్తవృత్తి గల శాంతము నకు రసత్వము సిద్ధించి తీరవలె నని అభినవగుప్తు డనినాడు. ఇట్టి శాంతము మిగిలిన రత్యాది భావములకు ప్రకృతి. రత్యాదులు శాంతముయొక్క వికృతులు, ప్రకృతినుండి ఉత్పన్నమైన వికృతి చివరకు ప్రకృతియందే లీన మగుటచే రత్యాది భావములు శాంతమున పర్యవసితము లగుచున్నవి. ఈ పర్యవసితత్వము లేనిచో, రత్యాదులకు భావశబ్దవ్యపదేశ్యత్వముండజాలదు. సుఖదుఃఖములు, ధర్మాధర్మములు మొదలగు వానిలో కన్పించు అన్యోన్యాభావ మీశాంతమున కన్పించదు. బుద్ధీంద్రియములు, కర్మేంద్రియములు సన్నిరుద్ధములై ఆత్మసంస్థితములై ఉండగా కలుగు సర్వప్రాణిసుఖహితమగు స్థితిని శాంత మనవలెనని భరతుడు చెప్పియున్నాడు.
శాంతము రసమైన శాంతానుభూతిలో చిత్తవృత్తులు నిరుద్ధములు కాజాలవు. ఇట్టి అనుభూతి మహాభారతమున మనకు గలదు. మహాభారతమున రసచర్వణ, ధర్మభావన అనురెండును అన్యోన్యసంపలితములై, అభిన్నములుగా ప్రతీయమానము లగుచున్నవి. మహాభారతయుద్ధ మెవరికిని ఉపకరించలేదనుట సత్యమే. ప్రధానపాత్ర లందరు ఆధ్యాత్మిక మగు ధర్మముపైకి కత్తి దూసినా రగుటచే ఉభయపక్షము లకు నీ యుద్ధమున దైన్యమే ఫలించినదని మహాభారతమున ధ్వనించుచున్నది. ఈ వ్యంజనావ్యాపారవశమున మనకు నిరపేక్ష భావనగల అనుభూతి కలుగుచున్నది. ప్రధాన పాత్రలలో గూడ నిష్కామప్రవృత్తి నిరపేక్షబుద్ధి కొంతవరకు గలవు. ఎవరి కేరీతిగా జగము ప్రతీయమాన మగుచున్నదో ఆ ప్రతీతి యంతయు అవసానవిరసము, అవిద్యాప్రపంచరూపము నగు చున్నది. మోక్షలక్షణ పరమపురుషార్థమును దార్శనికు లంగీకరించినట్లు, మహాభారతమున అంగిగా కనబడు తృష్ణాక్షయ సుఖ పరిపోష లక్షణ మగు శాంతరసమును కావ్యజగమున స్వీకరింపవలెను. మోక్షానుభూతి ఆస్వాద్యయోగ్యమై కావ్యజగమున కన్పించగా శాంతరస మనబడుచున్న దని లోచన కారు డనుచున్నాడు. ఇట్టి శాంతరసమును శృంగారాదుల వంటి రసముగా గ్రహించుటచే సమీక్షకులు అపమార్గమును త్రొక్కి వాద వివాదగ్రస్తులైనారు.
5. శృంగారాదులగు ఎనిమిది రసములలో నేదేని ఒక రసముయొక్క రూపాంతరమే శాంతమని కొందరనినారు. నాగానందములో కన్పించు జీమూతవాహునియందు శాంత రసత్వము సిద్ధించుచున్నదని దయావీరత్వము కలదని అనుచున్నారు. కాని వీరరసమున ఉత్సాహము అహంకారోత్కర్షను పోషించునది. ఈ అహంకారము శాంతరసాస్వాదమునకు శల్యభూతమైనది. శాంతమున నిరహంకారరూపత్వము లేక పోవుటచే శాంతము దయారసమున అంతర్భూతము కాజాలదని విశ్వనాథు డనినాడు. రసచర్వణలో కన్పించు అహంకార ప్రశమనము, దేశ కాలాద్యుపాధిభంగము అనునవి శాంతమున కూడకలవు. శృంగారాదిరసము లీ అహంకార ప్రశమా వస్థయందు పర్యవసితములై రసత్వమును పొందుటచే దయా వీరాదు లన్నియు శాంతమున అంతర్భూతము లగుచున్న వని చెప్పవలెనని విశ్వనాథుని అభిప్రాయము. శాంతమున దయా వీర మొక అంగము. శాంతముయొక్క ఒకానొక రూపాంతరమున కుపలక్షక మైనది దయావీరము. ఇట్లు శృంగారాది రసములు, రత్యాది స్థాయిభావములు, సాత్త్వికాద్యనుభావములు, సంచారిభావములు, విభావములు అనున వన్నియు శాంతమున కన్పించు వివిధములగు అంగములని సిద్ధమగు చున్నది.
పైగా వీరరసమునకు చెప్పబడు స్థాయిభావ మగు ఉత్సాహము ప్రతిరసానుభూతిలోను సంచారిభావానుగతమై, భావనాసంవలితమై కన్పించుటచే వీరరసమునకు రసత్వము లేదని చెప్పవలెను. అన్ని రసములలోను యత్కించిత్ గా ఉత్సాహానుభూతి యుండుటచే వీరమన్యరసములలోని అంగమే కాగలదు. వీర శాంతము లబిన్నములని చెప్ప గల్గినచో వీర రౌద్రములు కూడ నేల అభిన్నములు కావో చెప్పవలసియున్నదని ఆనందవర్థనుడు ప్రశ్నించి యున్నాడు. వీర భీభత్సాదులలో శాంత మంతర్భూత మగునని కొంద రనినారని అవలోక కారుడు చెప్పువాదముకూడ అశాస్త్రీయమే అగుచున్నది.
కొందరు శాంతముయొక్క స్థాయి ఉత్సాహ మనినారు. కాని ఈఉత్సాహము వీరప్రభవమైనచో వీర శాంతము లభిన్నములు కావలెను. అట్లుగాక ఈ ఉత్సాహము దయావీర మనబడు శాంతమును పోషించునదనినచో, దయావీరము నాయకస్వభావమును నిర్వచించునదని, రసపరమగు శబ్దముకాదని మరువరాదు. పైగా దయావీరము శాంతమే కాగలదు. కాని వీరము కాజాలదు. కావున దయావీరము శాంతముకు పర్యావాచమని లోచనకారు డనినాడు.
శాంతమున, శృంగారాదుల యందు కొంతవరకు ఉత్సాహప్రతీతి గలదు. కాని ఒకే స్థాయిభావమునుండి భిన్నరసములు రాగలవా? ఒకే ఒక కారణమునకు భిన్నములగు కార్యము లుండవని, ఒకే ఒక కార్యమునకు వివిధములగు కారణములు లేవని దార్శనికులు నిర్ణయించినారు. ఉత్సాహమునుండి వచ్చు వీరమున అభిమానము కలదని, శాంతమున అహంకారప్రశమ మున్నదని ఆనందవర్థను డనినాడు. శాంతమున కన్పించు ఉత్సాహము వీరమునగల ఉత్సాహము కంటె విలక్షణమైనది. దయావీరమును శాంతరసముగా చెప్పువారు, ధర్మవీరముకూడ శాంతరసమే కగలదని విస్మరించరాదు.
వీరత్వము వ్యక్తిస్వభావనిష్ఠము, రసనిష్ఠముకూడ కావచ్చును. రసనిష్ఠ మైనచో స్వయంసిద్ధము, స్వయంగ్రాహ్యము, స్వయంపోషకము నగుచు, అన్యాపేక్షగాని అన్యాశ్రయముగాని లేనిది కావలెను. కాని వ్యక్తిస్వభావము ప్రవృత్తినిష్ఠము, ప్రవృత్తిస్వభావనిష్ఠము నగుటచే వ్యక్తి స్వభావమగు వీరత్వమున అన్యాపేక్ష, అన్యాశ్రయము, కన్పించగలవు. దయావీరత్వము వ్యక్తిస్వభావనిష్ఠము. శాంతము రసనిష్ఠము. ఉత్తమ వీరరసమున అహంకార ప్రశమనము కలదనిన, ఈ ప్రశమమున తత్త్వజ్ఞానజన్యమని, తత్త్వ జ్ఞానము శాంతానుభూతిలోని దని తెలియవలెను. వీరము శాంతానుప్రాణితమైన రసము కాగల అవకాశము కుదుర గలదు.
జుగుప్సను శాంతస్థాయిభావముగా కొంద రంగీకరించి యున్నారు. ద్వేషము, అహస్యము, నిరసనభావము, రోయుట మొదలగునవి జుగుప్సలో కలవు. మోక్షము నుద్దేశించు శాంతమున లౌకికవిషయములపై జుగుప్స కలదు. ఈ జుగుప్స ఉన్ననే వ్యక్తి విరాగి కాగలడు. జుగుప్స నుండి బయలుదేరు శుద్ధమగు భీభత్సమున భౌతికవాంఛలపై అసహ్యము, నిరపేక్షబుద్ధి వైరాగ్యప్రవృత్తి కలవు. సందేహాదు లాత్మను భాధించునపుడు జుగుప్సితము లగు విషయములను భావించుమని సుఖములను నసహ్యించుమని యోగసూత్రము చెప్పుచున్నది. "వితర్క బాధనే ప్రతిపక్ష భావనం" అని యోగ సూత్రము.
విరాగియొక్క ప్రవృత్తిని మనము గమనించునపుడు భౌతికవిషయములపై విరాగికి జుగుప్స కలదని మన మెంచుట సహజమే. కాని విరాగియొక్క అనుభూతిలో జుగుప్స కలదా ? జుగుప్స ను ప్రధానచిత్తవృత్తిగా నుంచుకొనిన ఆత్మవిశ్రాంతి కలుగుట దుర్లభము. ప్రధానముగా గల జుగుప్స రాగద్వేషాదులను పోషించునదేగాని ఉపశమింపజేయునది గాదు. పైగా విరాగియొక్క లక్ష్యమురాగ ద్వేషాది రహితమగు స్థితి యగుటచే జుగుప్స నివృత్తము కాక తప్పదు. ఇట్లు నివృత్తమగు జుగుప్స సంచారిభావమే యగునని అభినమగుప్తు డనినాడు. విప్రలంభమున ఔత్సుక్యము రౌద్రమున ఔగ్ర్యము, కరుణలో నిర్వేదము, వీరమున ధృతి, భయానకమున త్రాసము, అద్భుతమున హర్షము, శాంతమున జుగుప్స వ్యభిచారిభావములు కాగలవు. వీటిని స్థాయి భావములని గ్రహించరాదు.
నిర్విఘ్న స్వసంవేదనాత్మక విశ్రాంతి లక్షణముగా రసచర్వణను వెనుక ప్రపంచించితిమి. ఇచట కలుగు ఆత్మవికాసమున దేశకాల ప్రమాతృత్వాదికము లగు ఉపాధులు లేవని చెప్పితిమి. హృదయసంవాదవశము రసాస్వాదములో వివిధ విషయములు సంపలితములై సమన్వయము నందుచున్న వనినాము. ఇట్టి హృదయసంవాదము గల వ్యక్తిని సహృదయుడని, పండితుడని అందుము. బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, కుక్క మొదలుగువాటియందు సమదృష్టి గలవాడే పండితుడని గీత చెప్పుచున్నది. ఈ సమదృష్టి కలుగనంతవరకు ద్వేషముతో కూడిన జుగుప్స కన్పడగలదు. పైగా శాంతమున జుగుప్స వ్యభిచారిభావమై విషయపరాఙ్ముఖముగా కన్పించ గలదు. కాని శాంతమున ఆత్మరతి ప్రధానముగా చూపట్టు చున్నది.
రసప్తీతిలో ఆత్మరతి కెట్టి స్థానమున్నది ? అనుభూతులను పొందుట ఆత్మయొక్క స్వభావముగా కన్పడుట గలదు. ఆత్మయొక్క శక్తి (స్వభావము) అనుభవించుట అనవచ్చును. అనుభూతిని తనకొరకై తానే వాంఛించునది ఆత్మ. కావున అనాహతానందమయ స్వాత్మవిషయకమగు రతియే మోక్షసాధనమని, ఇట్టి ఆత్మరతియే శాంతముయొక్క స్థాయిభావమని చెప్పుచున్నారు. ఆత్మయే ప్రమాత, ఆత్మయే ప్రమేయము కాగా, ఆత్మావలోకమున లేక ఆత్మానుభూతియందు విశ్రాంతిలక్షణమగు పరమసుఖప్రాప్తి యున్నదనినచో, ఈ అనుభూతి ఆత్మకంటె భిన్నము కాజాలదు. ఈ అనుభూతి ప్రవృత్తిజనకముకూడ కాలేదు కావున -
"య శ్చాత్మరతి రేవ స్యా దాత్మతృప్తశ్చ మానవః,
ఆత్మన్యేన చ సంతుష్ట స్తస్య కార్యం న విద్యతే."
అని గీత చెప్పుచున్నది. ఈ అనుభూతిలో సర్వభూతములు ఆత్మయందున్నట్లు, ఆత్మ సర్వభూతములలో నున్నట్లు ప్రతీతి గలదు. బాహ్యజగమును పూర్తిగా అవగాహన చేసికొనినపుడే ఆత్మరతి అర్థవంతము, భావగర్భితము కాగలదు. నిజమైన ఆత్మరతిలో రతిస్థాయిభావముగాక ప్రమాతృ ప్రమేయానన్యత్వము కలదు. ఈ అనన్యత్వము రసచర్వణలో నతివిశిష్టమైనదని చెప్పియున్నాము.
హాస, శోక, క్రోధ, భయ, విస్మయములలో నేదైన నొకటి శాంతముకు స్థాయి కాగలదని మరికొంద రనినారు. మానవుల దైనందిన వ్యవహారములజూచి శోకము, విషయలో లుపత్వముపై కోపము అధర్మభీరుత్వము, జగన్నాట్యమున చిక్కుకొనిన మానవులను జూచి హాసము, ఆధ్యాత్మిక చిత్రములను గాంచి విస్మయము మొదలగు భావములను శాంతాను భూతిలో పొందవీలున్నది.
ప్రత్యేకముగాగాని, సమష్ఠిగాగాని ఈ స్థాయి భావములు శాంతపరిపోషకము లని యనినచో వీటి కాయా రసము లలో కన్పించు విభావాదు లచట కన్పించ జాలవు. ఆయా విభావాదులు సంస్కృతములై రా వీలున్నది. ఇట్లు చేయు టలో విభావాదులతో స్థాయిభావమున కతిసన్నిహిత మగు సంబంధము లేదనవలసి వచ్చును. ఇది అశాస్త్రీయము. కాని స్థాయి భావమును ప్రవృత్తి పరముగా గాక, జ్ఞానాకారముగా అంగీకరించితిమేని స్థాయికి భావములతో సన్నిహిత సంబంధము లేదని చెప్పవీలున్నది.
సంస్కృతములై పరిష్కరింపబడిన స్థాయిభావములకు నిజస్వభావము పోయి నూతన స్వభావము వచ్చుచున్నది. స్థాయిభావములు క్రమక్రమముగా మార్పులను చెందుచున్నవి. పశుపక్ష్యాదులలో కన్పించు స్థాయిభావములను మానవులలో కన్పించు స్థాయిభావములకు విశేషభేదము కలదు. మానవులలో స్థాయిభావములు జ్ఞానపర్యవసితములై జ్ఞానముతో నభిన్నము లైనట్లు కన్పించుచున్నవి. "కొ¸్లుర్" మొదలగు శాస్త్రజ్ఞులు కోతులపై పరిశోధనలను సలిపి స్థాయి భావము జ్ఞానానుప్రాణిత మైనదని అస్రబుద్ధమగు జ్ఞానమే స్థాయియని నిశ్చయించి యున్నారు.
శాంతమున అనేక స్థాయిభావము లున్నవని అంటిమేని ప్రతిరసమున ఇట్లే ఉండవచ్చునా ? అను సందేహము కలుగక మానదు. అనేక స్థాయిభావములు కన్పించిన వీటిలో నొకటే ప్రధానమైనదని, మిగిలినవి దీని అంగములని చెప్పవలెను. అంగములైన స్థాయిభావములు సంచారిణులగును. పరిష్కృతములైన స్థాయిభావములు శాంతపరిపోషకము లనునపుడు స్థాయిభావ మనగా చిత్తవృత్తి యని విస్మరించరాదు. విభావ బలమున ఆత్మనుండి బయలుదేరు చిత్తవృత్తులను స్థాయి భావము లనవలెను. ఇట్లు ఆత్మ నుండి బయలు దేరుచు సత్త్వవిశిష్ట మగుచున్న స్థాయిభావ మొక్కటే గలదు. దీనిని శమమందురు. స్థిరమై అవ్యభిచారి యగు శమము సర్వరసముల యందు గలదని శార్జదేవు డనినాడు. శృంగారాదులలో నేదేని జనకరస మనుభూత మగునపుడు జన్మాంతరసుకృత విశేష వశమున శమ ముత్పన్న మగుటచే నిట్లు చెప్పబడిన దని కల్లినాథుడు వ్యాఖ్యానించినాడు.
ప్రతి రసచర్వణయందు నిర్విఘ్న ప్రతీతి ఆత్మవికాసము, విశ్రాంతి కలవు, కరుణరసప్రతీతిలో మన ముద్విగ్న మనస్కుల మగుటలేదు. ఇచ్ఛాశక్తి సంతృప్తి నందుచున్నది. ఇట్టి అనుభూతిని ప్రతిరసములోను కలుగజేయ జాలిన సూత్రమును శమ మనవలెను. ప్రతిరసము శాంతము నంతర్యామిగా గలిగి సజీవమై భావగర్భిత మగుచున్నది. శాంతప్రతీతిలేని రసప్రతీతిలేదు. రసత్వమున్న కొలది శాంతము ప్రతీతము కాగలదు.
రత్యాది స్థాయిభావము లన్నియు అవిభక్తములుగా శాంతమునకు స్థాయి యగుచున్నవి. మరికొంద రనినప్పుడు శృంగారాది రస సముదాయమునకు శాంతమను శబ్దము సామాన్యవాచకమని తేలగలదు. కాని చిత్తవృత్తు లన్నియు ఒకే ఒకసారి రా వీలు లేకపోవుటచేతను, చిత్తవృత్తులలో కొన్నింటికి అన్యోన్యభావ సంబంధము, అన్యోన్యవైలక్షణ్యము ఉండుటచేతను, ఈ సర్వస్థాయి వాదమును నిరాకరించక తప్పదు.
కాని శాంతమున కభినవగుప్తుడు తత్త్వజ్ఞానమును స్థాయిగా చెప్పుచున్నాడు. సమస్త లౌకికాలౌకిక చిత్తవృత్తి కలాప మిచట వ్యభిచారిరూపమున కలదనినాడు. సర్వస్థాయి భావములు వ్యభిచారిభావములై తత్త్వజ్ఞానమును పోషించగా శాంతము సిద్ధమగునని అభినవగుప్తుని వాదము. కొద్దిమార్పులతో సర్వస్థాయి వాదమే పరిగృహీతమగుచున్నది. చైతన్యము ప్రమాతృ ప్రమేయ రూపములుగా పరిచ్ఛిన్నము (ఉపహితము ) కాగా, ప్రమాతయందు చైతన్యము కన్పరచు చిత్తవృత్తులే స్థాయిభావములని, వ్యభిచారిభావములని చెప్పబడుచున్నవి. ప్రమాతృప్రమేయములను సమన్వయపరచు శుద్ధ చైతన్యమున నీ భావములన్నియు పర్యవసితము లగుచున్నవి. ఈ పర్యవసితత్వము ఎంతవరకు సమగ్రమగునో, తత్తుల్యమగు పురుషార్థము మనకు కావ్యజగమున కన్పడును. అపుడు రసములు శుద్ధచైతన్యాభివ్యంజకములు, శుద్ధచైతన్యావగతికి త్రోవ జూపునవియు నగును.
6. నాట్యశాస్త్రప్రాచీన వ్రాతప్రతులలో " స్థాయి భావా9 రసత్వ ముపనేష్యామః" అను పంక్తి యైనతరువాత " శాంతో నామ శమస్థాయిభావాత్మకః" అని మొదలుగా శాంతలక్షణము పఠింపబడినట్లు కలదు. దీని తర్వాత శృంగారాదులలక్షణము లీయబడినవి. సమస్త భావములకు ప్రకృతి భూతమైనది. శమ మని చెప్పుటకిట్లు పఠింపబడిన దని అభినవ గుప్తుడు పల్కినాడు.
శమమును స్థాయిభావముగా స్వీకరించితిమేని భావములసంఖ్య ఏబది కాగలదు. భరతుడు నలుబదితొమ్మిది భావములనే నిర్దేశించినాడు. శమముతో ఏబది భావము లగుటవలనను శమ శాంతములు పర్యాయపదము లగుటవలనను కొంద రీ శమస్థాయిభావము నంగీకరించకపోయినారు. భరతుడు స్థాయిభావము లెన్ని గలవో సంఖ్యానిర్దేశము చేయలేదు. స్థాయిభావములను చెప్పి వెంటనే నిర్వేదము మొదలుగాగల వ్యభిచారి భావములను పఠించినాడు. నిర్వేదశబ్దమునకు మంగళప్రదమగు అర్ధము లేదు. ఇట్టి నిర్వేదముతో భావముల నేల పఠించ వలసివచ్చినది ? నిర్వేదము రెండు విధములు. తత్త్వ జ్ఞానజన్యమగు నిర్వేదము శుభప్రదమైనది. రెండవది అశుభప్రదము. అమంగళభూత మగు అర్థమును సూచించుచున్నను, నిర్వేదము స్థాయిభావముగాను, వ్యభిచారిభావముగాను కలదని ఉభయధర్మ జీవిత్వఖ్యాప నార్థము స్థాయిసంచారిణులమధ్య చెప్పబడినది. కావున తత్త్వజ్ఞానజన్యమగు నిర్వేదము శాంతస్థాయియని వీరివాదము.
శమ శాంతములు పర్యాయపదము లగుటచే శమము స్థాయిభావము కాజాలదనువారు హాస మాస్య శబ్దములుకడ పర్యాయపదములే యని మరువరాదు. స్థాయిభావములగు శమహాసములు, సిద్ధములు, లౌకికములు, సాధారణములు, రసములగు శాంత హాస్యములు సాధ్యములు, లౌకికములు, అసాధారణములు.
భౌతికవిషయములపై ఔదాసీన్యమును జూపు నిర్వేదమొక్కొకచో జుగుప్సగా కన్పడగలదు. మరొకప్పుడు సంతుష్టిగా భాసించగలదు. దారిద్ర్యము, వ్యాధి, అవమానము, క్రోధము, తాడనము, ఇష్టజననాశము, తత్త్వజ్ఞానము మొదలగువానివలన నిర్వేదము కలుగును. ఇచ్చట రెండు భిన్నవిధములుగా నిర్వేదము కన్పించుచున్నది. తత్త్వజ్ఞానోద్భవ మగు నిర్వేదము స్థాయిభావ మని, ఇష్టానిష్ట వియోగాప్తికృత మగు నిర్వేదము వ్యభిచారిభావమని శార్జదేవుడనినాడు. స్థాయి యగు నిర్వేదము శాంతమున గలదని మమ్మటాదుల వాదము. ఇచ్చట తత్త్వజ్ఞానోద్భవ మగు నిర్వేద మున్నదనిన ఈ నిర్వేదము స్థాయిభావము కాగలదా ? స్థాయిభావ మనగా చిత్తవృత్తి. చిత్తవృత్తిని నియంత్రించునది తత్త్వజ్ఞానము, ఇచ్చటగల నిర్వేదమునకు జ్ఞానాకారము నంగీకరించవలెను. జ్ఞానముగా పరిణమించగల చిత్తవృత్తిని స్థాయి యనవలెను. గనుక స్థాయిభావమును జ్ఞానముకంటె సత్యంత విలక్షణమైన దానినిగా చెప్పరాదు. కావున జ్ఞానము వేరు, స్థాయిభావము వేరు అని చెప్పుచు స్థాయిభావమే ప్రకృష్టమైన దని పలుకు ''బెర్గ్స&'' వాదము నిరస్త మగు చున్నది.
స్థాయి, జ్ఞానము అనునవి రెండు ప్రవృత్తులని వీటికి అన్యోన్య వైలక్షణము పూర్తిగా కలదని ''బెర్గ్స&'' వాదము. వీటికి జన్యజనక భావము గాని, ప్రాక్పశ్చాదవస్థారూప సంబంధముగాని ఉండజాలదు. కాని '' కొ¸్లుర్ '', ''కొఫ్కా '', ''వెర్ఠెమర్ '' మొదలగు శాస్త్రజ్ఞుల పరిశోధనలలో స్థాయిభావము జ్ఞానానుప్రాణిత మైనది, సమభివ్యక్తము గాని జ్ఞానమే స్థాయిభావమని నిశ్చితమైనది. కావుననే స్థాయి భావమును చిత్తవృత్తియని భారతీయాలంకారికులు చెప్పుచున్నారు. చిత్తవృత్తి జ్ఞానముకంటె విలక్షణ మైనది కాజాలదు. జ్ఞానశూన్యమగు చిత్తవృత్తికి ప్రవృత్తిగాని, అర్థము గాని, ప్రయోజనముగాని ఉండదు.
నిర్వేదము స్థాయిభావమని, వ్యభిచారభావ మని, జ్ఞానాకార మని కూడ చెప్ప గలుగు చున్నాము. ఆయా సందర్భముల ననుసరించి నిర్వేదమున కీ లక్షణములు వర్తించుగలవు. బాహ్యజగమునుండి మరలిపోవుచున్న వ్యక్తియొక్క నివృత్త్యాత్మక మగు భావముగా నిర్వేదమును గ్రహించితిమేని, ఈ నిర్వేదమును హృదయసంవాదము మాటుపడగలదు. హృదయసంవాదము లేని చిత్తమును అద్రుతచిత్తమందురు. అద్రుతచిత్తము రసప్రతీతికి విఘ్నము కలిగించునది. ద్రుతచిత్తమున్నచో ప్రమాతృప్రమేయముల కభేద ప్రతిపత్తి ఆవరణభంగము కలుగగలవు. సంచార్యాది భావములద్వారా చిత్తమును ద్రవావస్థ కలుగును. వస్తువు స్వాకారమును ద్రుతచిత్తమున నుంచుచున్నట్లు కన్పించును. పరిచ్ఛిన్నము లైనను ఆత్మానాత్మలకు చైతన్యరూపమున నభేదము ప్రతీత మగుచున్నదని భావము. ఈ ప్రతీతిలో బాహ్యజగము ప్రమాత్రభిన్నముగా గలదు. మనకు చిరపరిచితమైన మృదుకరతల స్పర్శ కాలాంతరమున ప్రతీతమైన నెట్టి అనుభూతి కలుగునో అట్టి అనుభూతియే ఇచట గలదు. ఏవంవిధ మగు ఆధ్యాత్మికానుభూతి శాంతమున సిద్ధ మగుటచే శాంతమున రసపర్యాయముగా వ్యవహరించ గలుగుచున్నాము.
సర్వాను గ్రాహకము, స్వయంసిద్ధము, సాక్షిభాస్యమునగు చైతన్యావగతిలో ఇచ్ఛాశక్తి నివృత్త మగును. ఇచ్ఛాశక్తిరహితమగు ప్రతీతిలో జ్ఞానాగతి యుండుటచే రస మనగా జ్ఞానమని చెప్పుచున్నాము. ఇట్టి రసమును శమ మని నిర్వేదమని తత్త్వజ్ఞాన మని కూడ వ్యవహరించ వచ్చును. ఈ రసావగతిలో స్వలక్షణములుగా విషయములు భాసించక, ఉపహితములగు జ్ఞానములుగా ప్రతీయమానము లగుచున్నవి. తద్ద్వారా రసజగమున గల ప్రమేయము స్వతంత్రము, అన్యాపేక్షారహితము, స్వయంసిద్ధము, సమగ్రము నగుచున్నది. భావనావ్యాపారము సమున్మిషితమై తీవ్రరూపమును ధరించగా సంవేదనములు మనోహృదయముల నేకము చేయగా బాహ్యజగ మాత్మలో లీనమైనట్లు భాసించగా అద్వితీయ మగు ప్రత్యగాత్మప్రతీతి కలుగును. ఈ ప్రతీతికి కావ్యజగమున నభివ్యంజకమైనది రస మనబడు శాంతము. ఇచట వ్యక్తిగత మగు ఆత్మ ఉపాధ్యతీత మగుచున్నది. కావున తత్త్వజ్ఞాన జన్యమగు నిర్వేదము రత్యాదిస్థాయిభావముల కుపమర్దకమై భావవైచిత్ర్యసహిష్ణువులగు రత్యాదులకంటె ఉత్కృష్టమగు స్థాయిస్వభావముకలదై శాంతమున ప్రతీత మగును. స్థాయియనగా ఇట్టి నిర్వేదమేగాని, వేరొండు కాజాలదు. రత్యాదులీ స్థాయిభావముయొక్క వివరములు.
తత్త్వజ్ఞానము, నిష్కామకర్మ, నిదిధ్యాసనము, భావన మొదలగు వానిద్వారా నిర్వేద ముత్పన్న మగునని చెప్పితిమి. ఒకానొక అనుభూతివలన కలుగు ఫలితము నిర్వేదమని తాత్పర్యము. కాని శాంతమున కున్న స్థాయిభావమును విచారించు సదర్భమున ఫలావస్థను వివేచించుట తగుదు. ఐనను నిర్వేదమును ఒకింత విచారించి చూడవలసి యున్నది.
తత్త్వజ్ఞానమువలన నిర్వేద ముత్పన్న మగుచున్నదను వాదమును పరిశీలించుచున్నాము. తత్త్వజ్ఞానమునుండి కలుగుఫలితమేమి ?
''దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానా ముత్త
రోత్తరాపాయే తదనంతరాపాయా దపవర్గః''
అని న్యాయదర్శనము చెప్పుచున్నది. మిథ్యాజ్ఞానము నశించగా దోషములు, దోషములు పోగా ప్రవృత్తి, ప్రవృత్తి నశించగా జన్మ, జన్మలేనిచో దుఃఖము నశించుచున్నవి. తత్త్వజ్ఞానమ కలుగగా మిథ్యజ్ఞానము నశించును. ఈ మిథ్యాజ్ఞాన నాశమున దోషవినాశ##మే కలదుగాని, నిర్వేదప్రాప్తికాదు. శోకప్రవాహ ప్రసర రూపమగు చిత్తవృత్తివిశేషము నిర్వేదము. తత్త్వజ్ఞానము వైరాగ్యమును తెచ్చునది. రాగద్వేషాదుల ప్రధ్వంసయే వైరాగ్యము. కావున నిర్వేద తత్త్వజ్ఞానములకు జన్య జనక సంబంధము కలదని చెప్పుట అశాస్త్రీయము. పైగా నిర్వేదమునుండి కొన్ని అనుభూతులు బయలుదేరుటయే గాక, కొన్ని అనుభూతులు నిర్వేదమున పర్యవసితము లగుచున్నవని మరువరాదు.
7. తత్త్వజ్ఞానము, నిష్కమకర్మ, నిరపేక్షబుద్ధి, శౌచము మొదలగునవి శాంతమున కన్పించు విభావము లని భరతు డనుచున్నాడు. ఈ విభావముల ననుసరించి యను నియమాదులు వచ్చును. ఇ వన్నియు శాంతానుభూతిలో కన్పించు విశిష్టము లగు సన్నివేశముల ని తెలియవలెను. ఇచట చెప్పబడిన విభావములకు విభావత్వము లేదు. శాంతమున కన్పించు కొన్ని ప్రధానములగు అంశములనే విభావములనుటచే, ''విభావాద్యప్రతిపాదనం తస్య పరమపురుషార్థతయా లోకయాత్రాతిక్రాంతత్వాత్ '' అని భట్టగోపాలు డనినాడు. శృంగారాదులవంటి రసము కాకపోవుటచేతను, శాంతము అలౌకిక మగుటచేతను, శాంతమునకు విశిష్టముగా విభావములను భరతుడు పేర్కొనలేదు.
ఏవంవిధమగు శాంతమున చెప్పబడిన విభావములు బుద్ధేంద్రియ కర్మేంద్రియములకు సంబంధించిన యమ నియమాదులకు చెందినవగుటచే, శాంతము బాహ్యవిభావములచే పోషింపబడునది కాదని స్పష్టము. ఆంతరమగు స్థితియొక్కపరిపోషమే శాంతము. తత్త్వజ్ఞానము శాంతమున ముఖ్యమైన, శాంతము ఆధ్యాత్మికమైన, శాంతమున ఆత్మ, తత్త్వజ్ఞానము అను రెండును ప్రాణభూతములై కలవని చెప్పవలెను. తత్త్వజ్ఞానమే మోక్షసాధన మగుటచే మోక్షవిషయకమగు శాంతమున తత్త్వజ్ఞానమును స్థాయిగా చెప్పుచున్నాము. తత్త్వజ్ఞానమనగా ఆత్మజ్ఞానమని అర్థము. పరికల్పిత విషయోపభోగ రహితము, జ్ఞానానందాది విశుద్ధ ధర్మయోగి యగు ఆత్మయే శాంతమునగల స్థాయియని అభినవగుప్తుడు నిశ్చయించినావు. ఆత్మవగతియే రసచర్వణయని శాంతప్రతీతి యని కావ్యజగమున పిలువబడుచున్నది.
తత్త్వజ్ఞానజన్యము నిర్వేద మని చెప్పునపుడు తత్త్వజ్ఞానమే ప్రధాన మైన దని అందుచే స్థాయి యగుచున్న దని చెప్పవలెను. వస్తుతః నిర్వేదము తత్త్వజ్ఞానమున కుపకరించునది మాత్రమే యని తెలియవలెను. తత్త్వమును తెలిపికొని నిర్వేదము నందుట, నిర్వేదమునుండి మోక్షమును పొందుట మన అనుభవమున కన్పించదు. కాని నిర్వేదము కలుగుటచే తత్త్వమును తేలసికొనవలె నని యత్నించుచున్నాము. తత్త్వము ఆత్మకంటె, చైతన్యముకంటె, విలక్షణమైనదికాదు. చైతన్యమునకు బహిర్భూత మైనదానికి అస్తిత్వము లేదు.
తత్త్వము పురుషవ్యాపారనిష్ఠము కాదు. వస్తువులను అర్థవంతముగా భాసింపజేయున దగుటచే వస్తువులయం దుపహితముగా ప్రతీతి మగునది తత్త్వము. ఉపహితమై, విషయముల నర్థవంతము చేయజాలి, విశ్రాంతిలక్షణము కలిగినది. ఆత్మ యగుటచే తత్త్వజ్ఞానమున కాత్మజ్ఞాన మను నర్థమును చెప్పితిమి. ఆత్మజ్ఞానమున జ్ఞానమునకు ప్రమేయముగా ఆత్మకలదు. తెలసికొనవలసిన విషయము ఆత్మ. ఈవిషయమును తెలిసికొనునదికూడ ఆత్మయే. తనను తానే అనాత్మగా భావించు ఆత్మ ఇచట గలదు. కాని అవాత్మ యనగా జడపదార్థము కాదు. జడపదార్థములు సహితము ఆత్మ నంతర్యామిగా కలిగియుండి అనాత్మగా కప్పించుచన్నవి. కాని జగమున ప్రాణభూతముగా నున్న ఆత్మను (చైతన్యమును) తెలిసికొనవలెననిన ఆవరణభంగము కలుగవలెను. ఇట్టి ఆవరణభంగమే రసచర్వణలో కలదని వెనుక చెప్పితిమి. కావున రస మనగా శాంత మను అర్థము వచ్చుచున్నది. ఈ శాంతము నిరుపహితము, విశ్వజనీనము, సర్వానుగ్రాహకము, సర్వవిషయము లందు కల అనువృత్తప్రత్యయము నగుచున్నది.
సకల చిత్తవృత్తులు, భావములు ఈ ఆత్మ నాశ్రయించుకొని వచ్చునవి. స్థాయిరూపమగు ఆత్మ నాశ్రయించుకొనిన చిత్తవృత్తులను కూడ స్థాయిభావము లనుచున్నాము. ఈ స్థాయిభావములు వ్యభిచారిభావములవలె భాసించుచు ఆత్మాను భూతికి మార్గము చూపుచున్నవి. రత్యాది స్థాయిభావమును అభివ్యక్తపరుపజాలిన ఆత్మస్వభావము శమముగా కన్పించుట చేతను, ఆ స్థాయిభావములకు వివర్తోపాదాన మగుటచేతను, శమమునుగాని ఆత్మనుగాని ఏబదవ భావముగా లెక్కింప నక్కరలేదు. రత్యాదులవలె ఈ శమమునకు (ఆత్మకు) పృథగా స్వాదము లేదు. పైగా స్థాయిభావముల వ్యభిచారిభావములగునట్లు, ఈ ఆత్మ వ్యభిచారిభావము కాజాలాదు.
ఆత్మస్వరూపమగు తత్త్వజ్ఞానము శమము. కాలుష్యోపరాగ విశేషములుగా రత్యాదులు గలవు. కాని శమమున ఆత్మస్వభావము ప్రశాంతముగా నుండును. విశ్రాంతిలక్షణ మగు శమము యమనియమాదులద్వారా ప్రతీతిమగుచున్నది. ఈవిధమగు ఆత్మావగతిని అనిర్వచనీయముగా నిర్వచించి కావ్యజగమునుండి త్రోసివేయుట అనుచితము. మోక్షావస్థయందే ఆత్మస్వరూపాపత్తి లక్షణ ప్రాదుర్భావ ముండుట వలన, ఇట్టి అవస్థను శాంత మనుటవలన, శాంతముయొక్క స్వరూపము అనిర్వచనీయ మగుచున్నదని ధనికుడనుట ప్రామాదికము. శాంతముయొక్క స్వరూప స్వభావములను ఉపహితవిషయముల నుద్దేశించి బయలు దేరిన భాషతో సమగ్రముగా ప్రపంచించుట దుష్కరమగుటచే శాంతమును అనిర్వచనీయ మనవచ్చును. భావశూన్య మగుటచే శాంత మనిర్వచనీయ మగుటలేదు. శాంతమున అద్వితీయము, అపరిచ్ఛిన్నము నగు భావము కలదని అనుభూతిలో సంవేద్యమగుచున్నది.
శాంతమున రత్యాదులు వ్యభిచారిభావములవలె ప్రతీతము లగుటచే, తదాధారభూత మగు అనువృత్తప్రత్యయమును సూచించ గలుగుచున్నవి. శృంగారాది రసములు మండలమున గల ఎనిమిది దేవతలవలె నుండగలవు. ఈ దేవతల కాధారము, భూతము, చైతన్యము నగు దేవదేవునివలె శాంతము మండలమధ్యగత బిందువువలె నుండు నని శివాద్వయాగమము చెప్పుచున్నది. బాహ్యపిండము చైతన్నయమున లీన మైనను, చైతన్యమున మార్ప రానట్లు, శృంగారాదులు శాంతమున రత్యాదులు శమమున లీన మగుచున్నవి. ఆత్మ స్వభావమగు ఈ శమ మొక్కటే స్థాయిభావము. ఈవిధమగు శమము (శాంతము) నిరుపహితము. కాని లలితకళలు ఉపహిత స్వరూపములను జూపున వగుటచే అనుపహితత్త్వమును ధ్వనింపజేయగల్గిన సామర్థ్యము కావ్యజగమున కలదు. శృంగారాది రసములు వీటికి వివర్తోపాదన మగు శాంతరసమును ధ్వనింపజేయ గల్గుచు రసము లగుచున్నవి.
శృంగార హాస్యాది రూపములతో ఆత్మజ్ఞానము కావ్యజగమున ననుభూతమగుచున్నది. కాని ఆత్మజ్ఞానము ఆత్మావ గతియందే సమగ్రముగా కల్గును. కావున ఆత్మకు స్థాయిత్వమే కలదన గల్గుచున్నాము. ఈ స్థాయిత్వము ప్రతి అనుభూతిలోను శమమను రూపమున కన్పించుచున్నది. ఈ ప్రతీతిలో ఆత్మప్రమేయమువలె భాసించును. ప్రమేయము కాకున్నను ప్రమేయమువలె భాసించుచున్నదను జ్ఞానము కలుగగానే మనకు ప్రమేయ మవగతము కాలేదని, ప్రమేయమున్నదా ? లేదా ? అను సందేహము కల్గును. ఇట్టి స్థితిలో కలుగు వితర్క బాధవలన కావ్యనుభూతి కతీతమగు అపరోక్షానుభూతి కలదను భావము మన కుదయించగా, ఏవంవిధ మగు అనుభూతినే కోరుచు ఆధ్యాత్మికజగమును ప్రవేశించుచున్నాము. శమము ద్వారా ఆధ్యాత్మికమగు ప్రత్యగాత్మప్రతీత నంద గలుగుచున్నాము. దీనినే బ్రహ్మాస్వాదమని యందురు.
ఈ ఆస్వాదమున మహత్తర మగు పురుషార్థప్రతీతి యుండుటచే నిట స్థాయిత్మే కలదనవలెను. కాని వ్యక్తి వివేక వ్యాఖ్యనావసరమున రుయ్యకుడు శమముకూడ వ్యభిచారిభావము కాగలదని చెప్పినాడు. కోపాభిహతునకు కల్గు ప్రసాదోద్గమమున శమము సంచారిభావ మగు నని ఇతనివాదము. ఇది అశాస్త్రీయ మని వెనుక వివరించ యున్నాము.
అభినవగుప్తుడు తత్త్వజ్ఞానమును స్థాయిగాను, భావము గాను కూడ ప్రస్తుతించి యున్నాడు. శమ మొక్కటే స్థాయియని ప్రపంచించినాము. రత్యాదులవంటి స్థాయిభావము కాకపోవుటచే శమమును భావమనవచ్చును. ఇట్టి శమముచే పరిపుష్టమైన శాంతమున ఆధ్యాత్మికము, లోకోత్తరమునగు ప్రతీతి కలదు. ఈ ప్రతీతిలో సుఖ మున్నది ? లేక దుఃఖ మున్నదా ? అను ప్రశ్నలు కలుగవచ్చును. కాని రసచర్వణలో సుఖదుఃఖముల కున్న స్థానమును వెనుక చెప్పియున్నాము. ఇచట వైషయికసుఖము లేదనవచ్చును. ఈశమమున భావము లన్నియు సమన్వితము లగుచున్నవి. కాని శాంతప్రతీతిలో ని భావముల కతీతము, ఈభావములకంటె విశిష్టమునగు ప్రతీతికలదని మరువరాదు. రాగద్వేష మధ్యస్థ వృత్తులు నశించగా శమమున నిర్మలహృదయము కలుగును. ఇట్టి హృదయముతో కవి నట సామాజికులు తన్మయత్వము నందుచున్నారు.
ఇట్టిస్థితిని సామాజికునకు ప్రమేయ మగు కావ్య మొసగుచున్నది. అనుభూతిలో గల ప్రమేయము కవికిచ్చుచున్నది. ప్రమయములు శాంతాభివ్యంజకము లని భావము. సంవిదధీనమై సంవిదభిన్నముగా భాసించునది ప్రమేయము. కావుననే ద్రుతచిత్తముయొక్క ప్రకాశమును శమ మని మధుసూదనసరస్వతి అనినాడు.
రసచర్వణను విశ్రాంతిలక్షణ మనినాము. ఈ విశ్రాంతి ప్రమోదసారము. శబ్దము, ఛందము, గీతము మొదలగువాని ద్వారా నా ప్రమోదము కలుగు చున్నది. మనో హృదయములు నిర్మలములు కాగా, హృదయసంవాదవశమున భావనా వ్యాపారముద్వారా కావ్యానుశీలనమున తన్మయత్వము వచ్చుచున్నది. ఇట్టి స్థితిలో ప్రమేయము సత్యమా ? కాదా ? అని మొదలుగాగల ప్రశ్నలు బయలుదేరవు. పైగా దేశ కాలవిశేషావేశానాలింగనత్వముతో నలరారు స్థితి సంభవించుటచే సామాజికుడు పాత్రలతో నభేదము ననుభవింప గలుగుచున్నాడు. ఇట్లే కవిగూడ పాత్రలతో తాదాత్మ్యము నందు చున్నాడు. సర్వత్ర స్వాత్మరూపమగు మతి కలదు. స్వాత్మరూపమున విశ్వమును దర్శింప గలుగుచున్నాడు. ఇది హృదయాభ్యంతర నిఖాత మగుటచే తిరోహిత మగుటలేదు, విస్మృత మగుటలేదు. ఇట్టి అనుభూతి మన వ్యావహారిక జీవితమునకూడ గొప్ప పరిణామములను తీసికొని రాగలిగి యున్నది. ఇట్టి అనుభూతిని నిజ సంవిదానంత ప్రకాశమయ మని, విచిత్రమని, శాంతమని, రసమని వ్యవహరించుచున్నాము.
శాంతమున అనుభూతమగు ఆత్మచైతన్యము కావ్యమున ఉపహితమగు చైతన్యముకంటె విలక్షణము కాదు; కావ్యానుశీలనమున భావనావశమున హృదయసంవాదము కల్గుచున్నది. హృదయసంవాదమున ప్రమేయములోనికి స్వాత్మానుప్రవేశ మున్నదను ప్రతీతి కల్గును. ఇట్లే ప్రమేయమాత్మలో నంతర్లీన మైనట్లు కూడ భాసించును. కావున ''సాధారణీభూతతయా సామాజిక మపి స్వాత్మసద్భావేన సమావేశయంతీ'' అని అభివనగుప్తు డనినాడు. కావ్యాను భూతికి బహిర్భూత మగు చిత్తవృత్తిని అపేక్షించనటువంటి ప్రతీతి కన్పించుటచే నీ శాంతాస్వాదము లౌకికములగు ప్రత్యక్షానుమానాదులకంటె విలక్షణ మైనది. ఇది చిత్తవృత్త్యంతర జననాక్షమము. ఏవంవిధ మగు అనుభూతి నిర్విఘ్న స్వసంవేదనాత్మక విశ్రాంతి లక్షణమ, రసనావ్యాపారగ్రాహ్యము నగుటచే రస మని పిలువబడుచున్నది. రస మనగా రస ప్రతీతి. రసప్రతీతి, రసచర్వణ, రసాస్వాదము అనునవి పర్యాయపదములు. రస మనగా శాంతము. ఈ శాంతము కావ్యజగమున గల పురుషార్థము లగు శృంగారాదులకంటె విలక్షణము. శృంగారాదులద్వారా శాంత మభివ్యక్త మగుచున్నది. కావున శృంగారాది రసములు శాంతముయొక్క ప్రాతిభాసిక రూపములు.
8. రసప్రతీతి లోకోత్తరము, సత్యము, పారమార్థికము ముఖ్యము నగుటచే రసము లని వ్యవహరింపబడు శృంగారాదులకంటె భిన్నమైన శాంతమును మహారస మనవలెను. ఈ శాంతమునకు పారమార్థిక సత్యత్వ మున్నచో శృంగారాదులను అసత్యము లనవలెను. ఇట్లు స్ఫోటవాదము నంగీకరించితిమేని శృంగారాదుల కేవిధమైన అస్తిత్వమును ఆపాదించలేము. కాని శృంగార హాస్యాదులు కూడ ప్రతీతము లగుచున్న వని గమనించితిమేని ఈవాదము దూరనిరస్తమగును.
ప్రాభాకరమీమాంసకుల అన్వితాభిధానవాదము నంగీకరించి శృంగారాదులు శాంత మను సాధ్యమునకు ఉపాయాత్మకము లనవలెను. కాని, రసము ఆనుమానికము కాదని సాధనములగు హేతువులద్వారా సిద్ధమగునది కాదని వెనుక చెప్పియున్నాము.
భాట్టమీమాంసకుల అభిహితాన్వయవాదము ననుసరించి శృంగారాదిరససముదాయమునగల అనువృత్తప్రత్యయమే శాంతమని చెప్ప వీలున్నది. ఈ సముదాయమున శృంగారాదులు అంగములు. అంగములసముదాయమకంటె విలక్షణము, ప్రతి అంగమున నంతర్లీనము, ప్రతిఅంగముయొక్క పరమావధియ నగునది శాంతమని తాత్పర్యము. శాంతము శృంగారాదులలో అంతర్యామిగా నుండుటయేగాక, తదధ్యక్షత్వ లక్షణ లక్షితముకూడ నగును.
ఏవంవిధమగు శాంతము వివర్తోపాదానము. ఈ మహారసమున ఆయా సన్ని వేశములలో కన్పించు రుపాంతరము లను శృంగారాది రసము లనవలెను. లౌకికజగమున అనురాగాత్మకమై ప్రతీతము కాగా శాంతమును శృంగారమందుము. విరాగముగా, నిష్కామముగా కన్పించగా హాస్య మందుము. ఈరెండియందుగల సాపేక్షభావము నాశ్రియించుకొనివచ్చునది కరుణ. ఈ మూటియందును రౌద్ర, వీర, భయానక బీభత్సములు అంతర్భూతము లగుచున్నవి. ఈఅంతర్భావమున కలుగద్వంద్వప్రతీతిలో అద్భుత ముత్పన్న మగుచున్నది. కావున రస మొక్కటే అని స్పష్టము. భరతుడు కూడ ''న హి రసాదృతే కశ్చి దర్థః ప్రవర్తతే'' అనుచో రసశబ్దమును ఏకవచనముగా ప్రయోగించినాడు. ఇట్టి మహారసమును కవిగత సాధారణీభూత సంవిత్ అని చెప్పవలెను. ఈ శాంత మన్నిరసములలోను అనువృత్తప్రత్యయముగా కన్పించుటచే శృంగారాదులు శాంతపర్యవశితములై రసశబ్దము నందగల్గుచున్నవి. ఇంతేగాక శృంగారాదులలో శాంతమే ఉపహితమై యుండుటచే ప్రతిరసమును శాంతప్రాయ మగు ఆస్వాదమే కల్గుచున్నది. ''తత్ర సర్వరసానాం శాంతప్రాయ ఏవాస్వాదః '' అను అభినవగుప్తుని భావమును ''భగ్నావరణాచిత్ '' అని జగన్నాథుడు ప్రపంచించి యున్నాడు. రసప్రతీతిలో ఉపాధు లనబడు ఆవరణ పూర్తిగా భగ్న మగుచున్నది. కావున ఆ యా నిమిత్తములు ననుసరించి వివిధభావముల శాంతము నుండి వచ్చుచున్న వని, నిమిత్తాపాయమున మరల శాంతము ననే లీన మగుచున్న వని భరతు డనినాడు.
మహారసము, రసపర్యాయవాద్యము నగు శాంతము సత్త్వప్రధానము. మనోవ్యాపార మగు సాత్త్వతీవృత్తి ఇచట గలదు. రసధర్మములుగా కన్పించువానిలో మాధుర్య మిట వశిష్టముగా, ఉత్తమముగా కలదు.
--''''' ఇతిశమ్. '''''--